ఏలీయాను పోలిన సాహసోపేత పరిచర్య - దేవుని రాజ్య ప్రాతినిధ్యం | Courageous ministry similar to that of Elijah represented God's Kingdom

ఏలీయాను పోలిన సాహసోపేత పరిచర్య దేవుని రాజ్య ప్రాతినిధ్యం 

"యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లలకు హృదయములను తండ్రులు తట్టును త్రిప్పును." - మలాకి 4:5-6

ప్రవక్తల పనులలో అతి ప్రాముఖ్యమైన పని తండ్రుల హృదయములను పిల్లలు తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పుట, దేవుని రాజ్య ప్రతినిధులమైన మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైన పరిచర్య అని చెప్పాలి. సంబంధాల పునరుద్ధరణ దేవుని రాజ్య మూలాలలో చాలా ప్రాముఖ్యమైనదని అది ఏలీయాని పోలిన దేవుని రాజ్య ప్రతినిధిగా మనం అలవరచు కోవలసినదని వాక్యం మనకు గుర్తు చేస్తోంది. పై ప్రవచనం బాప్తిస్మమిచ్చు యోహానుకు సంబందించినదే అయినా ఆ నియమం మాత్రం మనకు కూడా ఆపాదించుకునే అవకాశం ఉంది.

elijah, eliya


1 రాజులు 17 వ అధ్యాయంలో ఏలీయా యొక్క జీవన విధానాన్ని మనం చూడగలం. దేవునికి ప్రజలకు నడుమ యేర్పడిన సంబంధ అగాధాన్ని నివారించడానికి దేవుడు తనను యెన్నుకుని ఆహాబు రాజును అతని రాజ్యాన్ని దేవుని రాజ్య పరిధిలోనికి తీసుకు రావడానికి సంబంధించిన మరమత్తుకు పూనుకుని రాజు ఉగ్రతకులోనై సారెపేతు గ్రామంలో ఇంకో మహిళ మరియు ఆమె కుమారుని జీవితంలో సంబంధ పునరుద్ధీకరణకు కుటుంబ నిర్మాణానికి, కుటుంబ పోషణకు దేవుని రాజ్య నియమాల పునాదిని వేస్తాడు. ఇది ప్రవక్తలకు ఉండే ప్రధాన లక్షణం - సంబంధ మరమత్తు - దేవునికి ప్రజలకు నడుమ మరియు మనుష్యులకు మనుష్యులకు నడుమ ఉన్న సంబంధాలను పునరుద్ధరీకరించడం ప్రవక్తలకున్న ప్రధాన పిలుపు. అందులో సరిచేయడం, సర్ది చెప్పడం వంటి రోషము గల క్రియలు మనకు కనిపిస్తుంటాయి.

ఏలీయా ప్రవక్త ప్రజలకు దేవునికి మధ్య నిలువబడి మధ్యస్థ ప్రార్థన చేస్తూ, ఆ భౌతిక రాజ్యంలో దేవుని రాజ్యం స్థాపించే దిశగా పోరాడటం మనం చూస్తాం. అదే ప్రార్థనను యేసు మత్తయి 6:9-13 లో “కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు. నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక, మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము." అని దేవుని రాజ్యమునే ప్రాథమిక అవసరతగా చెప్పి ప్రార్ధనను నేర్పాడు.

ఏలీయా ప్రవక్త యెజెబేలు రాజ్యమును ఆమె ప్రవక్తలను, తన దేవీ దేవతలైన అషేరా, ఆప్తారోతు, బయలు వంటి సాతాను సంబంధ దేవీ దేవతలను ఇశ్రాయేలు రాజ్యం నుండి బయటకు పారద్రోలే ప్రయత్నం చేశాడు. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన భావం యేమిటి అంటే దేవుని రాజ్యం అనగా భౌతికమైన ఆధిపత్యంతో కూడిన పెత్తందారీతనం కాదు. కానీ ఏదెను తోటలో కోల్పోయిన దేవుని పట్ల విధేయత ఆయనతో జత పనివారముగా ఉండే మహిమ నుండి తొలగి సాతాను రాజ్యాధికారం, వివక్షతో కూడిన పతన వ్యవస్థ మరియు స్థితిగతులనుండి మానవాళిని విడిపించి తిరిగి యథావిధిగా దేవుని కుటుంబ విలువలతో కూడిన జీవన ప్రమాణాలలోనికి ప్రజలను కట్టడం అన్న మాట.

ఇంతకీ మనం యెవరి అధికారం క్రింద ఉన్నాం, మనం కోల్పోయినది యేమిటి? దేనిని పొందటానికి లేక దేనిని తిరిగి స్థాపించడానికి ప్రభువైన/మెస్సియా అయిన యేసు వచ్చాడు? అన్న ప్రశ్నలకు లేఖానాధారం సమాధానం కేవలం మత స్థాపన లేక మతపరమైన వివరణతో కూడిన పరలోక సంపాదన కాదు సుమా - అది సమగ్రంగా యావత్ మానవ జాతిని తిరిగి దేవుని కుటుంబ సభ్యులుగా మార్చి దేవునితో కోల్పోయిన సంబంధాన్ని పునరుద్ధరించి, ఆయన అధికారమును మరియు ఆయన మంచి చిత్తమును మానవ జీవితాలలో స్వచ్ఛందంగా ఆహ్వానించి ఏదెను తోటలో ఉన్న షలోమ్ అనే అనుభవాన్ని తిరిగి స్థాపించడమే దేవుని రాజ్య స్థాపన

ఆలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు

                                           -రావి జాన్ సుందర్ రావు

కామెంట్‌లు