హిందుత్వకు హిందూ మతానికి ఉన్న వ్యత్యాసం. | hindutva & hinduism both are not same

 హిందూత్వ మరియు హిందూ మతం రెండు ఒకటి కావు. | hindutva & hinduism both are not same

విశ్వాసం విశ్వమంతా ఉంటుంది. సంస్కృతి ఒక భూభాగానికి పరిమితమై ఉంటుంది. ఇది సామాన్య స్పృహ. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ విశ్వాసాలను, సంస్కృతులను కలబోసి మాట్లాడటం అలవాటైపోయింది. ముఖ్యంగా "భారతదేశంలో సంస్కృతికి, విశ్వాసానికి తేడా లేనే లేదు అన్న భావనను ఒక ప్రణాళికా బద్ధంగా భారతీయుల హృదయాలలోకి బలవంతంగానే నెట్టుతున్నారు" అని అనిపిస్తోంది. 

విశ్వాసం, ప్రేమ, సహోదరభావం, సమానత, పరస్పర గౌరవంలాంటి అమలు చేయగల, అనుభవించగల, అదృశ్యమైన, వైశ్విక సత్యాలు సాంస్కృతిక నేపథ్యానికి మాత్రమే ఆగిపోక సరిహద్దులు ఏవీ లేక విశ్వవ్యాప్తంగా మానవాళి నిస్టరంగా ఒప్పుకునే అంశాలు. ఇవి ఎగుమతి, దిగుమతులకు ఆవల ఉన్న మానవ విలువలు. ఏ దేశంలోనో పుడితే వస్తాయన్న గ్యారెంటీ లేదు, ఏ దేశంలోనో ఉంటె అమలు చేయకూడదన్న నియమమూ లేదు. సర్వమానవాళికి నైతికత, తర్కం, ఆలోచన, భావనలు మొదలైనవి జన్మసిద్ధంగా ఉంటాయి.

కానీ ఈ రోజుల్లో నైతికత మరియు విశ్వాసంలాంటి విశ్వ మానవ విలువలు కూడా సాంస్కృతిక మరియు మతపరమైన నేపథ్యంలో ప్రజలకు నూరి పోస్తున్నారు. ఏ మతమైనా, ఏ కులమైనా తార్కికంగా మాట్లాడిన మాట ఆమోదయోగ్యం కదా!! అలాగే విశ్వాసమును కలిగి ఉండే స్వేచ్ఛ అందరికీ అన్ని చోట్లా ఉంది కదా! దానికి దేశ సరిహద్దులు అడ్డు కాదు కదా! అందరికి భావ ప్రకటనకు తావు ఉండాలి అన్నది మానవ విలువ కదా!! కానీ మన దేశ మత పెత్తందారీ వ్యవస్థ కాషాయ గూండాల రూపంలో లేని సరిహద్దులు సృష్టిస్తోంది. మన దేశ సంస్కృతికి, హిందూ మతానికి ముడిపెడుతోంది. హిందుత్వ (హిందూత్వ గురించి మన్ముందు చూద్దాం) అజెండాలో భాగంగా మిగిలిన మతాలకు, బ్రాహ్మణ వాదానికి మధ్య సవతి తల్లి వ్యత్యాసం చూపిస్తోంది. 

కాషాయ గూండాలకు "సంస్కృతి" అనే పదము భావోద్రేకంగా వాడటం తప్ప, సత్యమైన వేరే గత్యంతరం ఇక మిగిలి లేదు అని చెప్పడానికి వారు పోతున్న పోకడలే నిదర్శనాలు అనిపిస్తోంది.

"కిరాయి మతం” అని, “దిగుమతి చేసుకున్న మతం" అని, "అరువు తెచ్చుకున్న మతం" అని పలు రకాలుగా బ్రాహ్మణ వాదులు అన్య మతాలను ఒక పక్క దూషిస్తూనే, ఇంకో పక్క అమెరికా, రష్యా, చైనా, జపాన్ ఐరోపా మొదలగు ప్రాంతాలలో వారి మత సామ్రాజ్యాలను బాబాల ద్వారా స్వామీజీల ద్వారా నిర్మించుకుంటోంది. "ఇదెక్కడి విడంబన ?” అని అడిగితే "భారతీయ సంస్కృతి అన్నిటికన్నా ముందు నుండి ఉంది, కాబట్టి మేము వేరే దేశాలలో మా మత విస్తరణ కోసం పాటు పడొచ్చు. కానీ వేరే మతాలు ఇక్కడ విస్తరిస్తే చూస్తూ ఊరుకోం" అంటూ డొంక తిరుగుడు మాటలు చెప్పి హిందుత్వానికి భారతీయత అంటగట్టి కాషాయ మీడియాల ద్వారా ప్రచారం చేస్తోంది. 

నిజానికి ఈనాటి హిందుత్వానికి మన భారతీయ సంస్కృతికి అసలు ఏ పొంతన సంబంధం లేనే లేదు అన్నది చారిత్రాత్మక సత్యం. నేటి భారతీయ సమాజానికి ఒక సంస్కృతి లేదు, భిన్న సంస్కృతుల భావజాలాల మిశ్రిత సమాజం ఈ భారతీయ సమాజం అన్నది వేరే చెప్పక్కరలేదు. ఏదేమైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. దిగుమతి చేసుకున్న సబ్బు, పెన్ను, సూటు బూటు, భాష, బతుకు దెరువు, రేడియో, టీవీ, ఫోను, వ్యాను, ఇలా చూస్తూ పోతే ప్రతి సాంకేతిక ఉపకరణం, జీవన శైలిలోని ఎనభైశాతం దిగుమతి చేసుకున్నదే. పిల్లోడి పుట్టుక నుండి, ముసలివాడి చావు వరకు వాడే వస్తువు, భాష, సుఖం, చూసే బొమ్మ అన్నీ విదేశీ అయినప్పుడు, మన సంస్కృతిలో అవి భాగాలు అవలేదు అని చెప్పడం ఎంత అజ్ఞానమో ఆలోచించండి

కొందరు మనువాదులు లేక బ్రాహ్మణ వాదులు వారి జాత్యాహంకార ధోరణితో ప్రజలపై రుద్దుతున్న బానిసత్వ సంకెళ్ళతో కూడిన విషవాదమే మనువాదం లేక హిందుత్వ వాదం. అంతే కానీ వీరు సామాన్య భారతీయతకు సారూప్యమైన హిందువులు కారు. భారత దేశంలో ఉన్న జీవన విధానంలో ప్రకృతిని పూజించి, వారికి మేలు చేసే వస్తు, ప్రాణులను పూజించే సరళమైన సామాన్య మతం హిందూ మతం. 

Hindutva and Hinduism both are not same

కానీ దానికి జాత్యాహంకార ధోరణిని పులిమి భారత దేశంలో ఉన్న దళిత, బహుజన, మూలవాసి, ఆదివాసి, ముస్లిం, సిక్కు మరియు క్రైస్తవ మతాల అనుయాయులను భయభ్రాంతులను చేసి అధికార దాహంతో దృవీకరణ రాజకీయ లబ్ది పొందటం హిందుత్వ అనే సనాతన ధర్మ లక్షణం కనుక యీ బ్లాగ్ లో యెక్కడ హిందుత్వ వాదులు అన్నా దానికి అర్ధం కేవలం విభజించి పాలించాలనుకునే మత ఛాందస బ్రాహ్మణవాద, మనువాదులనే దృష్టిలో ఉంచుకుంటున్నాం అని గుర్తించాలి..

కామెంట్‌లు