యెహెూవా రాజ్యం చేస్తున్నాడు | Jehovah is ruling

యెహెూవా రాజ్యం చేస్తున్నాడు 

నిర్గమ 15:18లో యెహెూవా నిరంతరం పాలిస్తాడు లేక రాజ్యం చేస్తాడు అన్న మాటలు కనిపిస్తాయి. అలాగే సంఖ్యా 23:21లో ఇశ్రాయేలు యొక్క రాజు యెహెూవాయే అన్న అర్థం కనిపిస్తుంది. ఇదే కోవలో ద్వితీ 33:5యెషయా 43:15లో యెహెూవా ఇశ్రాయేలు పై రాజ్యం చేయువాడు అన్న సందేశం మనకు కనిపిస్తుంది. అలాగే ఇశ్రాయేలు మాత్రమే కాక సకల జనుల పైనా ఆయనే పాలించు రాజు అన్న సందేశం కూడా మనకి బైబిల్లో కనిపిస్తుంది. 2వ రాజుల గ్రంధం 19:15లో ఆయన అందరికీ దేవుడని, రాజని చెప్పే దాఖలాలు కనిపిస్తాయి. ఇంకా స్పష్టంగా యెషయా 6:5, యిర్మియా 16:18, కీర్తన 29:10, 17:2, కూడా ఇదే భావాన్ని మనకు అందిస్తున్నాయి.

93వ కీర్తనను గమనిస్తే యెహోవా రాజ్యం చేస్తున్నాడు. ప్రభావాన్ని ఆయన వస్త్రంగా ధరించి యున్నాడు.. అంటూ ఆయన రాజసం సర్వ భూమండలం పైనా విస్తరించి ఉన్నట్టుగా కీర్తనాకారుడు ప్రశంసిస్తున్నట్టు గమనిస్తున్నాం. ఇదే మాటలు కీర్తన 96:10, 97:1, 99:1-4, 145:11. కూడా ఆయనను సకల భూరాజ్యాలకు అధిపతి అని ప్రకటిస్తున్నాయి. ఆయన రాజ్యం ఇశ్రాయేలుకు మాత్రమే పరిమితం కాక అన్య జనులకు, సకల భూ రాజ్యాలకు కూడా వర్తిస్తుంది అని స్పష్టంగా మనకు అర్ధం అవుతోంది.

యెహెూవా రాజ్యం చేస్తున్నాడు | Jehovah is ruling



ఈ వచనాలన్నీ యెహెూవా రాజ్యం చేస్తున్నాడు అని చెబుతూనే బైబిల్ లోని ఇంకెన్నో వచనాలు యెహెూవా రాజ్యం రాబోతోంది ఆయనే స్వయంగా. వచ్చి రాజ్యం చేస్తాడు అని కూడా చెబుతున్నాయి. ఆయన తన పరిశుద్ధ స్థలమును విడిచి భూమి పై మనుష్యుల నడుమ కాపురం ఉంటాడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని కూడా వాక్యం నొక్కి వోక్కానిస్తోంది. యెహెూవా ప్రత్యేకంగా ఇశ్రాయేలు వారికి రాజు అయినప్పటికీ తన కట్టడాలను ఇశ్రాయేలు ద్వారా ప్రపంచమంతా వ్యాపింపజేసి అందరి పైనా రాజు అవుతాడు అన్నదే పాత నిబంధన యొక్క మూల పాఠం. ఆయన ప్రస్తుతానికి తన పరలోక సింహాసనము పై నుండి రాజ్యం చేస్తున్నప్పటికీ ఆయన తన ప్రజల వద్దకు వచ్చి నివాసం చేస్తాడని, నిజంగా వారి మధ్య నుండి తన రాజ్య పరిపాలనను కొనసాగిస్తాడని పాత నిబంధన యొక్క బోధ. ఈ రాజ్యం యొక్క లక్షణాలను మనం ఇది వరకే గమనించాం కూడా!

దేవుడే కేంద్రంగా ఉండే ఈ రాజ్యమును మల్కుత్ ఎలోహిం అన్నారు. ల్యాటిన్లో బెసిలియా అన్నారు. మల్కూత్ అనగా రాజు యొక్క రాజ్యాధికారం, ప్రభుత్వం, శక్తి, మహిమ రాజ్యం అన్న అర్థాలు వస్తాయి (దానియేలు 2:37. 4:34). కీర్తన 145:11,13 అలాగే 103:19లో కూడా ఇదే వివరణను చూడగలం. రాజు తన రాజ్యాన్ని వివిధ సమయాలలో సందర్శిస్తూ ఉంటాడు. అన్నట్టుగా దేవుడు కూడా తన రాజ్యాన్ని సందర్శిస్తాడు అలా సందర్శించిన సమయం ప్రజలకు ఎంతగానో సంతోష కరమైన సమయం అన్న సందేశం పాత నిబంధన యావత్తులో కూడా కనిపిస్తూ ఉంటుంది..

"10. యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది,  న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. 11. యెహెూవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. 12. పొలమును దానియందు గల సర్వమును యెహెూవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక, 13. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహెూవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.” (కీర్తన 96:10–13)

పై కీర్తనలో యెహెూవా రాక మరియు ఆయన రాజ్యయోగ క్షేమములు మరియు వాటి చక్కబెట్టే విధానం కారణంగా జనములు ప్రహర్శించడం మనం చూస్తాం. ఇలా రాజు దర్శించడం ప్రజలలో పండుగ వాతావరణానికి కారణం అవుతుంది. ఆయన రాజ్యం ఏలుతున్నాడు మనం ఆయన ప్రజలము అనేది ఒక ఎత్తయితే ఆయనే స్వయంగా మనలను సందర్శించ బోతున్నాడు. ఆయనే వచ్చి మన మధ్య నివసించబోతున్నాడు అన్నది ఒళ్ళు గగుర్పాటు కొలిపించే చాలా దివ్యమైన సమాచారం. ఈ ఆనందాన్ని వాక్యం కీర్తన 98లో కూడా వర్ణిస్తుంది. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడతాయి, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేస్తాయి అంటూ తన సన్నిధి తీసుకు వచ్చే ఆనందం మరియు ఉత్సాహాన్ని కీర్తనాకారుడు వివరిస్తున్నాడు.

రాజు/దేవుడు రాబోతున్నాడు అన్న అంశం పాతనిబంధన మొత్తంలో కూడా కేంద్రక అంశంగా పరిగణించబడుతోంది. ఈ విషయమై జి.ఈ. ల్యాడ్జ్ గారు "The whole history of Israel, from the birth of the nation at Mount Sinai to her final redemption in the Kingdom of God, can be viewed in light of the divine visitations (ఇశ్రాయేలు యొక్క చరిత్ర, అనగా సీవాయి వద్ద వారి రాజ్య ఆరంభం నుండి మొదలు దేవుని రాజ్యంలో అనగా యేసు రాజ్యంలో వారు విమోచించబడే వరకు అంతా కూడా దేవుడు వారిని దర్శించడం అన్న విశేష అంశం గురించే అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.) 

దేవుడు ఇశ్రాయేలు ను రాజుగా దర్శించిన అనేక సందర్భాలు మనకు కనిపిస్తాయి. కొన్ని మీ ముందు ఉంచుతాను. యెహెూవా సీవాయి నుండి వచ్చాడు, శేయీరులో నుండి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుండి ప్రకాశించాడు. వేలాది వేల పరిశుద్ధ సమూహాల నుండి ఆయన వచ్చాడు. ఆయన కుడి చేతిలో ప్రక్కన అగ్ని జ్వాలలు మండుచున్నాయి- ద్వితీయో 33:2

"ఇశ్రాయేలు దేవుడైన యెహెూవాను కీర్తిస్తాను: యెహోవా నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు, భూమి వణికింది, ఆకాశం నీళ్ళను కురిపించింది . మేఘాలు వర్షించాయి. యెహెూవా సన్నిధిని కొండలు నీల్లుగారి పోయాయి అవి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయి పర్వతాలు," (న్యాయా 5:4-5).

"7. దేవా, నీవు ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణకెను. 8. దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను" (కీర్తన 68:7-8)

" 3. దేవుడు తేమానులోనుండి బయలుదేరుతున్నాడు పరిశుద్ధదేవుడు పారాను లోనుండి వేంచేయు చున్నాడు (సెలా.) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. 4. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లు చున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది. 5.ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చు చున్నవి.  ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరిగించువాడు. 10. నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును. 11.నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. 12. బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించుచున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు. 13. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు దేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు." (హబక్కూకు 3:3-13)

ఇలా దేవుడు తన ప్రజలను దర్శించడానికి వచ్చిన విధానాన్ని పండితులు థియోఫెనీ అన్నారు. ఆయన రాకకు యావత్తు సృష్టి కంపించి భయపడి కదిలిపోతుంది. ఆయన రాకకు తత్తరిల్లిపోయే విధానం ఆయన శక్తిని మరియు సృష్టియావత్తు ఆయనపై ఎంతగా ఆధారపడి ఉందో మనకు గుర్తు చేస్తుంది. ఇవన్నీ కేవలం జరగబోయే భవిష్యత్తుకు సంబంధించిన ఘటనలు అనుకోవడం పొరబాటు. చాలా సార్లు యెహెూవా దర్శించి ప్రజలను విడిపించిన దాఖలాలు చరిత్రలో అనగా పాత నిబంధన చరిత్రలో కనిపిస్తాయి. కానీ దేవుని ప్రత్యేక సందర్శనంగా రాబోయే రోజును ప్రభువు దినం అని కూడా వాక్యం సంబోధిస్తుంది. ప్రభువు దినం నాడు యెహెూవా బయలుదేరి తాను యుద్ధ కాలంలో యుద్ధం చేసిన రీతిగా యుద్ధం చేస్తాడు. నా దేవుడైన యెహెూవాతో కూడా ఆయన పరిశుద్ధులందరూ వస్తారు అని ప్రభువు దినం గురించి జెకర్యా చెప్పడం గమనించగలం (జెకర్యా 14:3, 5). ఇదే దినం గురించి యెషయా తత్తరిల్లు హృదయులతో ఇలా అనండి.. మీ దేవుడైన యెహెూవా వస్తున్నాడు (యెషయా 35:4). ఇలా ఆయన భవిష్యత్తులో రాబోయే ప్రభువు దినం గురించి యెషయా 35:4, 59:20, 26:21,6 3:1-6, 64:1, 65.15-16 వాక్య భాగాలలో ప్రస్తావించడం __. ఇలా మిగిలిన ప్రవక్తలు కూడా ప్రభువు దినమును ముందుగానే ప్రవచించారు.

ఇలా ప్రభువు వచ్చి ప్రజలతో నివాసము చేసే దినమును ఇశ్రాయేలు వారు తరతరాలుగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహెూవా ఇశ్రాయేలు పైన అలాగే సకల జన సమూహం పైన ఏలుబడి చేస్తున్నప్పటికీ ఆయన ప్రత్యేకంగా తన ప్రజలను దర్శించే సమయాలు తీర్పు తీర్చడానికి విమోచించడానికి, సరి చేయడానికి మరియు ప్రజలలో ఆనందం రేకెత్తించే సమయంగా బైబిల్ చెబుతోంది. అంత మాత్రమే కాదు ఆయన ప్రత్యేకంగా ఒక దినాన సకల భూమి పై సకల జనులకు రాజుగా రాబోతున్నాడు, ఆ దినాన్ని ప్రభువు దినం అన్నారు అని ఇంత వరకు చూశాం.

యేసు క్రీస్తు ప్రకటించినట్టుగా దేవుని రాజ్యం వచ్చేసింది. ఆయన సింహాసనాసీనుడై ఏలుతున్నాడు. శత్రువైన సాతానును సిలువలో బాహాటంగా సిగ్గుపరచి ఓడించి మరణం అనే అసలైన శత్రువును కూడా జయించి దానికి మరణం అనే శిక్షను విధించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆ అధికారంతో తన రాజ్యాన్ని స్థాపించి తన పునరుత్థాన శరీరంలో నూతన సృష్టికి నాంది పలికాడు. అంటే యెహెూవా వచ్చేసాడు. కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య డేరా వేసాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ మనతో మనలో తన ఆత్మ (పరిశుద్ధాత్మ) ద్వారా నివాసం ఏర్పరచుకుని రాజ్యం చేస్తున్నాడు. అందుకే ఆయన రాజ్యం వచ్చేసింది అంటున్నాం. అలాగే ఆయన దినం లేక ప్రభువు దినాన ఆయన రాబోతున్నాడు లేక సంపూర్ణంగా తన సన్నిధిని లేక సముఖాన్ని కనపరచబోతున్నాడు. 

ఈ కనబరచబడటం గురించి గ్రీకులో "పరౌసియా" "PAROUSIA" అన్న పదం వాడారు. ఇది రావడం అన్న అర్థం కంటే కూడా కనబరచుకోవడం అన్న అర్థం ఇస్తుంది. ఆ సమయంలో ఆయన తన సృష్టి యావత్తును తీర్పు తీరుస్తాడు - లేక న్యాయయుక్తంగా సరిచేస్తాడు. అందుకే యెషయా పర్వతాలు మెట్టలు ఎలుగెత్తి పాడతాయి అని అంటున్నాడు. (యెషయా 55:12). ఆయన న్యాయవంతమైన దేవుడు కనుక తీర్పు తీరుస్తాడు. కానీ ఆ తీర్పు నాశనకారి కాదు, సమకూర్చి, సమాధానపరిచే తీర్పు తన సృష్టిని తిరిగి తనకు అనుగుణంగా మలచుకునే తీర్పు  దీన్నే విమోచన కార్యం అంటున్నాం. ఈ మాటలను పౌలు భక్తుడు కొలస్సీ 1:15-20 లో చెబుతున్నాడు. ఆకాశంలో ఉన్నవి, భూమిలో ఉన్నవి, దృశ్యమైనవి, అదృశ్య మైనవి, సింహాసనాలు, ప్రధానులు, అధికారులు, సర్వం ఆయనలో సృజింపబడినాయి. ఆయన అన్నిటికీ ప్రారంభం.. ఆయనలో సర్వ సంపూర్ణత నివసించాలన్నది తండ్రి కోరిక.. 

ఆయన సిలువ రక్తం ద్వారా సంధి చేసి సమస్తాన్ని అవి భూలోకం లోవైనా, లోవైనా, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవడం తండ్రికి ఇష్టమైనది. ఆయన రాకకు అసలు ఉద్దేశం ఇది. అందుకే ఇంకో చోట పౌలు  - "ఈ సంకల్పాన్ని బట్టి పరలోకంలో ఉన్నవైనా భూమి మీద ఉన్నవైనా సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని తనలోతాను నిర్ణయించుకున్నాడు." (ఎఫెసీ 1:10) అని చెబుతున్నాడు. కనుక యేసు చేసిన సిలువ యాగం తన అద్భుతమైన అందమైన ఆరోగ్యకరమైన మంచి సృష్టిని తిరిగి కొనుక్కోవడం, విడిపించడం, పవిత్రీకరించడం వంటి కార్యములకు విజయసోపానం అయ్యింది. మరణం అన్నది ఆయన సృష్టిలో ఆయన సృష్టించని మానవ తిరుగుబాటుకు పర్యవసానమైనది కనుక ఆ మరణాన్ని జీవాధిపతి అయిన సజీవుడు జయించి తీరాలి.. ఆయన మాత్రమే జయించగలడు కూడా.. ఇది జరిగినప్పుడు మాత్రమే యేసు తన రాజ్యాన్ని తండ్రికి బహుకరించగలడు. అప్పుడు దేవుడు మంచి అని పిలిచిన ఈ భూమ్యాకాశములను తన నివాసముగా  చేసుకొని అంతటా తానే అంతా అవుతాడు. దీనినే వాక్యము నూతన ఆకాశము నూతన భూమి అని కూడా చెబుతోంది..

పరమదేశ మిదిగో - నూతన - యెరూస లేమిదిగో - సోదర = 
తిర మగు పురమది - దివ్య సుందరము -తరముగాదు త -ద్దయు వర్ణింపగ. 
పరమ జనకు సముఖం - బచ్చట - నరులతోడ నుండన్ - సోదర = 
నరులు దేవుని - నరులై యుందురు - పరమాత్ముడు దన - వారలతో 
                                                    నుండును.

                                                           -తూలూరి కోర్నేలియస్ 505 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు


కామెంట్‌లు