యెజెబెలును ఎదిరించడం బయలు ప్రవక్తలను పారద్రోలడం | Opposing Jezebel and overthrowing the prophets of Baal

యెజెబెలును ఎదిరించడం బయలు ప్రవక్తలను పారద్రోలడం

"అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు.. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకుబోధించుచు వారిని మోసపరచుచున్నది. ప్రకటన 2:20 ప్రవక్తల పరిచర్య ఏలీయా యెజెబెలును ఎదిరించిన రీతిలో సంఘము నుండి జారత్వపు ఆత్మను విగ్రహార్పితములు  తనలో ఇముడ్చుకునే వైఖరిని పారద్రోలాలి. దేవుని రాజ్యములో ఆయన రాజ్య ప్రతినిధులు ఆయన నియమాల చొప్పున జరిగించవలసిన అనేక విధులు యెజెబెలు తన ప్రవక్తలు ద్వారా తన ఇష్టానుసారం అష్టారోతు మరియు అషేరా దేవతలకు చేయిస్తూ వస్తుంది.

prophets of baal


"అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఏలీయాజరు కుమారుడునైన ఫీనెహాసు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోసము. రగులుకొనేను." 
(సంఖ్యాకాం. 25:1-3) ఈ నియమానికి విరుద్ధంగా ప్రవర్తించింది యెజెబెలు.

"యూదరాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఇరువదిరెండు సంవత్సరములు ఏలెను. ఒమీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సిదోనియలకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను." (1 రాజులు 16:30-34)

ఆహాబు తన రాజ్యంలో యెహోవాకు హేయమైన సంస్కృతిని పెంచి పోషించాడు. జన సమూహములను అనైతికత వైపుకు తన భార్యయైన యెజెబెలు ద్వారా నడిపించాడు. తన పూర్వీకులందరికంటే హేయమైన కార్యములు ఆహాబు చేశాడు అంటే ఇశ్రాయేలు రాజ్యము యొక్క పరిస్థితి ఊహించగలం.

"బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను." అనేమాట కేవలం మత సంబంధమైన మార్పుకు మాత్రమే సూచన కాదు కానీ భావజాలం మరియు సాంస్కృతిక నేపథ్యాన్ని ఆ సంస్కృతిలోని ప్రజల నైతిక జీవన విధానాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా ఈ మార్పును అర్ధం చేసుకోవాలి. బయలు దేవత ఆరాధన, బయలు దేవత మందిరం, బయలు దేవత బలిపీఠం మరియు దేవతా స్తంభం వేరు వేరు సామాజిక అకృత్యాలకు చిహ్నాలు. ఆరోజుల్లో జరిగే మతపరమైన మారణహోమాలకు, సామాజిక అఘాయిత్యాలకు వేదికలుగా ఈ మార్పులు అగుపడుతున్నాయి.

ఇక్కడ బయలుకున్న వేరు వేరు పేర్లు మరియు వాటి వివరాలు చూసి. యేవిధంగా దేవుని రాజ్యానికి ఆ రోజుల్లో బయలు దేవత తన స్వంత రాజ్యాన్ని కట్టే ప్రయత్నం చేసింది అనేది గమనిద్దాం. బయలు దేవతకున్న భిన్నమైన పేర్లు:

బయల్గాదు ("అదృష్ట దేవత" యెహోషువా 11:17
బయలు హామోను  ("ధన దేవత" పరమగీతం 8:11
బయల్టాసారు  ("బయలు యొక్క గ్రామం" 2 సము 13:23
బయల్మెయోను ("నివాసముల దేవుడు" సంఖ్యా 32:37
బయల్పెయోరు ("మొదళ్ళ దేవుడు" ద్వితీయో 4:3
బయల్తామారు ("తాటి చెట్ల దేవుడు" న్యాయ 20:33),

ఇలాంటి ఇంకా ఎన్నో రూపాలలో బయలు దేవతను లేక బయలును ఆరాధించే వారు ఆనాటి కనాను మరియు ఐగుప్తు ప్రాంతీయులు.


elijah the prophet



"కనానీయుల ముఖ్య దేవుని కుమారులలో ఒకరైన బయలు, పాంథియోన్ యొక్క కార్యనిర్వాహక దేవుడు, ఉరుములు మరియు శీతాకాలపు తుఫానుల దేవుడు, భయంకరమైన గందరగోళ శక్తులకు వ్యతిరేకంగా దైవిక క్రమాన్ని సాధించిన బలమైన యోధుడైన దేవుడు. అతను వృక్షసంపద, కాలానుగుణ సంతానోత్పత్తి చక్రంతో కూడా గుర్తించబడ్డాడు.. బయలును కొన్నిసార్లు 'దాగోను కుమారుడు' అని పిలుస్తారు. దాగోను కూడా వృక్షసంపద దేవుడు.

ప్రత్యేకంగా "మొక్కజొన్న" అన్నది అతని పేరుకున్న అర్ధం.. 'వేసవి వచ్చేసరికి వర్షాలు వస్తాయా?' అని రైతులు ఆందోళన, సంక్షోభానికి గురవుతారు. అప్పుడు వారు వర్షపు దేవుడైన బయలుకు లైంగిక క్రీడలతో కూడిన సంప్రదాయ ఆచరణను చేస్తూ, క్షుద్ర పూజలతో బయలును పిలవడం ద్వారా వారి ఉద్రిక్తతలు విడుదల అవుతాయని నమ్ముతారు" మాగ్నస్సన్ , బిసి- ది ఆర్కియాలజీ ఆఫ్ ది బైబిల్ ల్యాండ్స్.

అలాగే "బయలుతో విలక్షణమైన కనిష్ట సంబంధం ఉన్న దేవత అనాత్, ప్రేమ మరియు యుద్ధ దేవత - ఇష్టార్ వంటిది. ఆమె బయలును సంఘర్షణలో ప్రోత్సహిస్తుంది. అతను కృంగిపోయినప్పుడు, దేవతల ప్రభావం తాత్కాలికంగా కుంటుపడినప్పుడు, బయలు యొక్క అర్ధాంగిగా.. సంపూర్ణం చేస్తుంది. క్లిష్టమైన సమయాల్లో మహిళల పాత్రను ప్రతిబింబిస్తుంది. "                                                                                         - జాన్ గ్రే  నియర్ ఈస్టర్న్ మైథాలజీ.

కొందరు బయలు సూర్యుడికి, అత్తరోతు చంద్రుడికి అనుగుణంగా ఉంటారని అనుకుంటారు, బయలును "బృహస్పతి" అని మరియు అష్తారోతును "వీనస్" అని ఇతరులు భావిస్తారు. బయలు ఆరాధన మోషే కాలంలో మోయాబీయులలో మరియు మిద్యానీయులలో ప్రబలంగా ఉంది, (సంఖ్యా 22:41) మరియు వాటి ద్వారా ఇశ్రాయేలీయులకు వ్యాపించింది. సంఖ్య 25:3-18; ద్వితీ 4:3 లో బయల్పెయోరు కనిపిస్తాడు. రాజుల కాలంలో ఇది ఆస్థాన మతంగానూ మరియు ఇశ్రాయేలు తెగల ప్రజల మతం అయింది. 1 రాజులు 16:31-33; 18:19,22 దీన్ని బట్టి ఈ మతం వారిలో ఎప్పటికీ శాశ్వతంగా రద్దు చేయబడలేదని తెలుస్తుంది. 2 రాజులు 17:16 యూదాలోని బయలుకు దేవాలయాలు నిర్మించబడ్డాయి. 1 రాజులు 16:32 మరియు అతన్ని చాలా వేడుకలతో ఆరాధించారు. 1 రాజులు 18:19,26 28 10:22 లలో యూదులకు ఈ ఆరాధన యొక్క ఆకర్షణ నిస్సందేహంగా దాని విచ్చలివిడి ప్రవర్తన ద్వారా పెరిగిందని చెప్పాలి. ఈ ఆరాధనను ఫినిషియన్ కాలనీలలో కూడా కనుగొన్నారు. "పురాతన బ్రిటీష్ ద్వీపాల మతం,  బయలు యొక్క ఈ పురాతన ఆరాధనను చాలా పోలి ఉంటుందని, దాని నుండే ఉద్భవించి ఉండవచ్చు" అని కూడా చరిత్రకారులు చెబుతుంటారు.

బయలు అనుయాయులు అక్రమానికి, విచ్చలివిడితనానికి, వేశ్యావృత్తికి అనైతికతకు అలవాటు పడినట్టుగా చరిత్ర చెబుతోంది. అంతట యెహోరాము యెహూను చూచి "యెహూ సమాధానమా?" అని అడుగగా యెహూ "నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధానమెక్కడ నుండి వచ్చుననెను." (2 రాజులు 9:22)

బయలు దేవత రాజ్యం సమాధాన లేమితో నిత్యం జారత్వం, చిల్లంగి తనంతో కూడి ఉంటుంది. "బయలు” అనగా “ఒక దేవుడు" అని కాకుండా. "బహు దేవుళ్ల కలయిక” అని కూడా పైన చెప్పబడిన వివరణ ద్వారా తెలుసుకొనవచ్చు. ఇటువంటి పద్ధతులు గల మత ప్రాతిపదికన రేకెత్తించే గందరగోళాన్ని ఇశ్రాలీయులు కోరుకునే సమయంలో ఏలీయా రోషము కలిగి, ఆయా దేవీ దేవతల ఉపాసన కారణంగా ఇశ్రాయేలీయులలో జరుగుతున్న అసామాజిక కార్యకలాపాలను, అసమానతను, అవినీతిని, మరియు విలువలు లేని అనైతిక జీవన విధానాలను బహిరంగంగా సవాలు చేశాడు. ప్రవక్తలకు లేక అంత్య కాలమందు దేవుని రాజ్య ప్రతినిధులకు ఉండవలిసిన ప్రధాన లక్షణం ఇది. దేవుని రాజ్య విలువలను మోసుకుని తిరగడం, అలా చేసే క్రమంలో యెదుటి వారిచేత దూషింపబడటం, వెక్కిరించబడటం, చివరికి ప్రాణహానికి కూడా భయపడక పాలకులను హెచ్చరించగల స్థాయికి యెదగడం. ఇవి దేవునిరాజ్య స్థాపనలో ప్రధాన అంశాలు. వీటిని కేవలం మత ప్రాతిపాదికన మాత్రమే చూడకుండా సర్వ మానవ సమానత్వమును మరియు అభ్యున్నతిని కోరే దేవ దేవుని రాజ్య స్థాపన అనే దిశగా చూడాలి.

అలా చేస్తూ ఏలీయా కర్మెలు కొండపైకి యెజెబెలు ప్రవక్తలను సవాలు విసిరి ఆహ్వానిస్తాడు. దేవతకు 400 మంది ప్రవక్తలు మరియు అషేరా దేవికి 400 మంది ప్రవక్తలు వచ్చి ఆ కొండపై నిలబడి ఏలీయాతో తలపడటానికి సిద్ధపడతారు. “అప్పుడు - ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము గా ఒక మాటైనను పలుక పోయిరి."  1 రాజులు 18:21

దేవుని రాజ్య ప్రతినిధులు ప్రజల మనసులో ద్వంద్వ మనస్తత్వాన్ని సవాలు  చేస్తారు. రెండు పడవల ప్రయాణాన్ని తూర్పార పడతారు. ఒకవైపు ఉండేందుకు స్పష్టతను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమనగా ప్రజలలో ఏం చెప్పాలో? ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో? తెలియని సంధిగ్ద పరిస్థితులు ఉంటాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిలో ఉండటం కూడా మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ సన్నివేశంలో పరిస్థితి అంత సంధిగ్ద0 లేక తేల్చుకోలేని లేని విధంగా లేదు. కొన్ని వందల సంవత్సరాలు దేవుని విశ్వాస్యత కనీ, వినీ యెహోవా దేవుని రాజ్యంలో బ్రతుకుతూ ఆయన కృపను  అనుభవిస్తూ  ఆయన ప్రవర్తన చేతులారా అందజేసిన ధర్మశాస్త్రమును రాజ్యాంగము గా కలిగి ఉన్న ప్రజలకు 'బయలు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు ఎవరు?' అన్న సాధారణ లేక సరళమైన అంశం అర్థం కాలేనిది ఏమీ కాదు కదా! 

అయితే ఇక్కడే అసలు రహస్యం ఉంది ఆత్మీయ అంధకారం అనేది ఇలానే ఉంటుంది. కళ్ళెదుట సాతాను దుష్క్రియలు, అబద్ధాలు 
కనిపిస్తూ ఉంటాయి కానీ వాటినే నమ్మాలనిపిస్తు ఉంది. కళ్లెదుట మహా దేవుని మహత్కార్యాలు కనిపిస్తూ ఉంటాయి ఆయన నమ్మక త్వాన్ని ఆయనే సత్యమన్న సందేశాన్ని ఇస్తూనే ఉంటాయి కానీ ఆత్మీయ గుడ్డితనం ప్రజలను సత్యానికి అనగా దేవునికి, అసత్యానికి అనగా సాతాను ప్రతినిధులైన బయలు వంటి దేవతలకు మధ్య వ్యత్యాసం తెలిసి ఏది ఎన్నుకోవాలో తెలియని విధంగా ప్రత్యుత్తరం గా ఒక మాటైనను పలుకక పోతుంటారు కీర్తన 115:3-7
    
ఇక్కడ ఇంకొక విడ్డూరం ఏమిటంటే  ఇశ్రాయేలు రాజు ఇంట్లో నుండి భార్య అయిన యెజెబేలు స్వయంగా తన ఇష్ట దేవత అయిన  బయలుకు మందిర నిర్మాణం చేయాలన్న భావనను రాజైన ఆహాబు ద్వారా నెరవేర్చుకొని, బయలు దేవతకు అషేరా, అనగా బయలు దేవత భార్య యొక్క విగ్రహం, లేక ధూప దీప నైవేద్యాలు వేసే స్తంభంను కట్టించి దేవుని ఉగ్రతకు మరింత పాత్రులు అయ్యారు ఇదంతా ప్రజల మధ్య లోనే జరుగుతుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు.   యెజెబేలు జీవము గల యెహోవా దేవుని భక్తులను, ఆయన ప్రవక్తలను ఏ విధంగా హింసిస్తోందో చూస్తాం.
ఆయన ఏమీ మాట్లాడలేని లేక ప్రత్యుత్తరం ఇవ్వలేని చైతన్య రహితులైన పరిస్థితి.  ఏ దేవతలను నడుమ నుండి తనకు రాజ్యముగా ఉండుటకు సాక్ష్యం గా ఉండుటకు ఇశ్రాయేలీయులను పిలుచుకున్నాడో ఆ రాజునూ, ఆరాజు ప్రతినిధులను విడిచి అదే రాజ్యం లో ఇంకో రాజునూ అటువంటి విగ్రహాల నుండి  ఎన్నుకోవడం ఆ విగ్రహాలకు తమ పిల్లలను, తమ శరీర అంగాలను సమర్పించడం ఎంత మూర్ఖత్వం అవుతుంది ? మూర్ఖత్వమే ఈనాటి ఆధునిక భాష లో "అంధ భక్తి  లేక మతోన్మాదం " అని కూడా పిలవవచ్చు.

"అప్పుడు ఏలీయా - యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి యున్నాను; అయితే బయలునకు ప్రవక్తలు నాలుగువందల ఏబదిమంది యున్నారు. మాకు రెండు ఎడ్లను ఇయ్యుడి. వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచవలెను, రెండవ యెద్దును నేను సిద్ధము. చేసి, క్రింద అగ్ని యేమియు వేయకుండనే దానిని కట్టెలమీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్ధన చేయుడి; నేనైతే యెహోవా నామమునుబట్టి ప్రార్ధన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలీయా మరల జనులతో చెప్పగా, జనులందరును - ఆ మాట మంచిదని ప్రత్యుత్తర మిచ్చిరి.” (1 రాజులు 18:22-24).

eliya pravakta



ఈ వాక్య భాగంలో ఏలీయా ప్రజల మధ్యలో ఉన్న ద్వంద్వ మనస్తత్వాన్ని సవాలు చేస్తూ సూచన లేక పరీక్ష రూపంలో ఒక అద్భుతమును జరిగించే దిశగా ప్రత్యర్థి పక్షాన్ని ప్రజలముందు కోరడం చూస్తాం. ఇది ఎంతో విశ్వాసం మరియు ధైర్యంతో కూడుకున్న సవాలు. తన స్వంత శక్తిపై ఆధారపడి చేయలేని దైవిక ప్రదర్శనగా చెప్పుకోవాలి. ఇందులో దైవ ప్రమేయం లేకపోతే లేక దైవ ప్రమేయం సమయానికి జరుగక పోతే అవమానం, అవిశ్వాసం, ఓటమి, మొదలైనవి మాత్రమే మిగులుతాయి. ఒకే వ్యక్తి నాలుగు వందల యాభై మందితో, వారి శక్తితో, గారడీ విద్యతో పోరాడాలి. అధికార పక్షమైన యెజెబేలు కు స్వాభావికంగా మంచి మద్దతు ఉంది కనుక ప్రతినిధులని నాలుగొందల మంది ప్రవక్తలకు కూడా స్థానిక ప్రజానీకంలో మంచి మద్దతు ఉండాలి. కానీ జీవముగల దేవునిరాజ్య స్థాపన ప్రజల మద్దతుతో కట్టడం జరగదు. అదే దేవుని రోషమును కలిగి తన ప్రజల కోసం తెగువ కలిగి జీవించే జీవన విధానం. అలా ఏలీయాల జీవించినప్పుడు ప్రజలలో  ఆయన తన మహిమను కనబరచుకుంటాడు. అంతట జనులందరును దాని చూచి సాగిలపడి "యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు" అని కేకలువేసిరి. అప్పుడు ఏలీయా ఒకనినైన తప్పించుకొనిపోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలీయా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. (1 రాజులు 18:39-40) ఇక్కడ చదువుతున్నవారు హింసను ప్రత్సాహిస్తున్నట్టుగా అర్ధం చేసుకోకూడదు. ఇది అప్పటికే అతిగా జరుగుతున్న హింసను ఆపటానికి ధర్మ శాస్త్రానుసారంగా ప్రవక్త ఇచ్చిన తీర్పు. ప్రజలను దేవునికి మరియు సమాజానికి (అనగా ప్రజలకు) విరుద్ధంగా జరిగించిన హింసకు ప్రజల సమక్షం లో ప్రజల చేత ఇప్పించిన తీర్పు ఇది. 

కనుక "క్రీస్తు రాజ్యము కేవలం కేవలం కొన్ని వచనాలను వల్లించి ప్రజలను కేవలం మత ప్రాతిపదికన కలపడం మాత్రమే కాదు కానీ అధికార పక్షాల వివక్షను అనైతికతను సమాజం లోని అవినీతిని అవిధేయతను ప్రశ్నించి  ప్రతి ఆలోచనను చెరపట్టి దేవునికి ఆయన రాజ్యానికి విధేయులుగా చేయడం కదా ?" అని ఆలోచించినప్పుడే మనకు ఈ లోకంలో ఈ లోక సంబంధులంగా కాకుండా రాజ్య సంబంధులముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిపక్వతను దేవుడు మనకు కలిగించును గాక!



విజయకరముగ బ్రతుకగ ప్రభువుండు నిజ వాగ్దత్తము లివ్వు నీ -
వృజినము గెలువంగను - ముదముతో నిజముగా నెరవేర్చడా
                                                                                                        || భయమేల క్రైస్తవుడా ||                                
                                                                                                        -జి జన్ తాతయ్య

                                                                                            ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 368

కామెంట్‌లు