నేటి సంఘ స్థితి | Present situation of Church

నేటి సంఘ స్థితి | current situation in Churches

కానీ క్రీస్తు రక్తముచేత కొనబడిన సంఘము మాత్రం తుచ్చమైన వాటి. మాయలోపడి పరిశుద్ధులకు సైతం తీర్పు తీర్చే స్థాయిలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి సంఘములో చీలికలకు వివక్షకు, విఘటనకు కారణమయ్యే భావజాలమైన అధికార దాహం, అహం, ఈర్ష్యతో కూడిన ఎత్తుగడలు, లింగ, ప్రాంత, కుల వివక్షలకు తావిచ్చి సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా ఈరోజు కనిపిస్తోంది. "అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి(1 కొరింథీ 6:9-11)

Present church


దేవుని రాజ్యానికి పునాది అయిన దేవుని సంఘములో అనీతిమంతులు రాజ్యాధికారం కొనసాగేలా దిగజారిన సంస్కృతిని పెంచి, పోషిస్తున్నాయి. విశ్వాస సమూహాలు, కోర్టులకెక్కి తమ అధికార దాహాన్ని పెత్తందారితనాన్ని ప్రదర్శిస్తుంటారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అన్న సంగతి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది. '
కులం' అనే విగ్రహారాధనతో నిండి ఉన్న వివక్ష పూరిత సమాజాన్ని సంఘంలో చూస్తున్నాం. సాటి మనిషిని వాడికి రావలసిన గౌరవాన్ని దేవుని స్వరూపంలో ఉన్నాడన్న సత్యాన్ని మరిచి నిందించి, చులకనగా చూసే ఈనాడు క్రైస్తవ సంఘాలలో కులం పేరిట, ఉపకులం పేరిట, ప్రాంతం పేరిట, భాష పేరిట చూస్తూనే ఉన్నాం. క్రీస్తుకు కట్టబడిన మనం ఇంకా మను ధర్మ శాస్త్రానుసారంగా 'మను'కు కట్టుబడి ఉండటం ఆత్మీయ వ్యభిచారం కాదంటారా? కులం పేరిట పెళ్ళిళ్ళు, కులం పేరిట పేరంటాలు, కులం పేరిట గుర్తింపు, కుల సంఘాలకు అధ్యక్ష పదవులు, కులం పేరిట విప్లవాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కులాన్ని ప్రాతిపదికగా చేసుకు తిరిగే కులగజ్జి ఉన్న క్రైస్తవ సంఘ నాయకులను ఆత్మీయ వ్యభిచారులు అనక ఇంకేం అనాలో చదువరులే నిర్ణయించాలి.

నిర్మలమైన రాజ్య సువార్తను అమ్ముకునే అంగళ్ళు తెరిచిన అభినవ క్రైస్తవ కుల పెద్దలకు తమ సొంత రాజ్యాన్ని నిర్మించడానికే సమయం లేదు అన్నట్టుగా ఉంది. ఇక దేవుని రాజ్య పనులు చేస్తారు అనుకోవడం ఒక రకంగా జరగని పని అనిపిస్తోంది. ఆదిమ అపొస్తలులు మొదలుకుని నిన్న మొన్నటి మిషనరీల వరకు ప్రకటించిన దేవుని రాజ్య సువార్తలో సమానత్వ సామ్యవాద విలువలు కనిపిస్తాయి. ఈనాటి బోధకులు దోచుకోవడానికి బోధ మొదలు పెట్టారా? అన్న ఆలోచన ప్రజలకు కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆపొ.కా. 2:30-31 పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి, ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.”

“నువ్వీరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళతావ్?" అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్నే, కానీ సువార్తకు కేవలం అది మాత్రమే కేంద్రం కాదు, అది మారు మనస్సు పొందటానికి ప్రారంభ స్ఫూర్తి మాత్రమే. సర్వసృష్టికి సువార్త, ప్రతి 'ఎత్నే' ('ఎత్నే' అనగా 'జనసమూహాం') శిష్యత్వంలోనికి నడిపింపబడాలి అని మత్తయి 28లో యేసు ఆజ్ఞను విన్నప్పుడు కేవలం చచ్చిపోయి పరలోకం పోవాలి అన్న కసి కంటే, అన్ని రాజ్యాలలో, జన సమూహాలలో యేసు రాజ్యం స్థాపించబడాలి అన్న రాజ్య స్థాపన గురించిన ఆసక్తి కనబడుతుంది. ఆయన రాజ్య స్థాపన విషయంలో శ్రమించమని ఆయన పిలుపునిస్తే, మనమేమో చస్తే పరలోకం పోతావా అన్న నినాదంలో సువార్తను కేవలం ఆత్మీయ కోణంలో ఆత్మకు మాత్రమే సమబందించినదిగా ప్రజలకు పరిచయం చేస్తున్నాం. ఇక్కడే అసలైన సామాజిక స్పృహను కోల్పోయే విధంగా సంఘం వ్యవహరిస్తోంది. పరలోకం మనకు కావాలి, నిత్య రాజ్యంలో వారసులం అవ్వాలి. అందులో ఏ రెండవ ఆలోచనా లేదు కానీ, దాని అర్థం కేవలం పరలోక ఆలోచనతో చచ్చిపోమ్మని కాదు. ఈ లోకంలో ఇక్కడ బ్రతికి ఉండగానే మన మన సమాజాల్లో మన మన రంగాలలో దేవుని రాజ్య స్థాపన అనేది ప్రభువు మనకిచ్చిన బాధ్యత అని గుర్తించిన నాడు క్రైస్తవ సమాజంలో ప్రతి వివక్ష, ప్రతి అసభ్యత, ప్రతి అనాగరికత, ప్రతి అమానుష ఆచారాలపై కదం తొక్కి పోరాడే వ్యూహాన్ని సంఘం రూపొందించుకో గలుగుతుంది.

మత్తయి 6:9-10 కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, - పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక దేవుని చిత్తం కేవలం క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవుల ఇళ్ళల్లో జరగాలని ఆలోచించేవారు అక్కడికే నిలువరింప బడతారు. దేవుడు అందరికి తండ్రి అని, ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద అన్ని రంగాలలో, అన్ని కుటుంబాలలో, అన్ని సమాజాలలో, అన్ని వ్యాపారాలలో, అన్ని ప్రభుత్వాలలో నేరవేరాలన్న ఆశ. ఆ దిశగా వ్యూహం, ఆ దిశగా ప్రణాళికతో కూడిన కార్యాచరణ చేయడం యేసు ప్రభువు రక్తంచే కొనబడిన దేవుని సంఘ కర్తవ్యం. ఇలాంటి రాజ్య స్థాపన మరియు విస్తరణ కేవలం ఆత్మీయమైన వారికే సాధ్యం. మత్తయి 5:3 - ఆత్మవిషయమై దీనులైనవారు. ధన్యులు; పరలోక రాజ్యము వారిది. ఈ దీనత్వం గురించి మాట్లాడుతూ మీకా ప్రవక్త ఇలా అంటాడు: మీకా 6:69 "ఏమి తీసికొని వచ్చి నేను యెహోవా దర్శింతును? ఏమి తీసికొని వచ్చి మహహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును?. దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది. పొట్టేళ్ళను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహెూవా నిన్నడుగుచున్నాడు."

మనం కట్టుకున్న మతం దశమ భాగాలకు, బలులకు, పండుగలకు, పబ్బాలకు, పెండ్లిళ్ళకు, దానికి కావలసిన వనరుల కోసం దేవుని కాకా బట్టటానికి మాత్రమే పనికొస్తుంది తప్ప మన బాధ్యత అయిన న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి దేవుని ప్రవర్తించుట అన్న రాజ్య విలువలు మాత్రం తుంగలో తొక్కుతున్నారేమో ఆలోచించాల్సిన విషయం ఇంత మహా దర్శనం భారతదేశంలో విస్తరింప చేయడానికి తమ  ఇల్లు, దేశాలు, కుటుంబాలు, సంస్కృతిని త్యజించి, మన దేశ పౌరులను అన్ని రకాల వివక్షల నుండి  తప్పించే దేవుని రాజ్య  స్థాపన అనే పనికి పూనుకున్న మిషనరీ వ్యవస్థ గురించిన అధ్యయనం ఈనాటికి ఎంతైనా అవసరం ఆ మహా మహుల  రాక మన పాలిట వరంగా మారింది. వారి త్యాగ ఫలం ఈనాడు క్రైస్తవ సంఘ ఆవిర్భావానికి ప్రాణం అయ్యింది, వారి రక్తపు పెట్టుబడి పై ఈనాటి సామ్రాజ్యవాద పాస్టర్లు తమ సొంత రాజ్యాలు కడుతున్నారు అన్నది కూడా విచారించ దగ్గ అంశమే అయినప్పటికీ వారి త్యాగ ఫలితం మనలను ఈ దేశం లో ఏ చేతి సహాయము లేకుండా తొలచబడిన రాయిగా ఇంతై ఇంతింతై మహా పర్వతమై దేశ విఘటన భావజాలాన్ని తుత్తునీయలుగా చేసే క్రమంలో ముందుకు కొనసాగిస్తోంది.

యేసు క్రీస్తు రారాజై యున్నాడనుచు భాసురంబుగా దెల్పుచూ= 

వాసిగా ప్రభు యేసు  - వసుధా రక్షకుడనుచు - ఈ సువార్తను జాటి 

ఇచట నిమ్మల నొంద = దోసకారి జనంబు లందర కి సుమంగళ వార్తన్ 

దెలుపుచు దోసమంతయు బాపు మన ప్రభు యేసున్ జూపెడు 

వారి పాదము... లెంతో సుందరమైనవి ధర గిరుల పై

                                                                        -మేడికాయల సాధువు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 267


కామెంట్‌లు