స్వరాజ్యం - దేవుని రాజ్యం | Self-Kingdom- the kingdom of God

స్వరాజ్యం - దేవుని రాజ్యం | Self Kingdom - The Kingdom of God

యేసు క్రీస్తు రాజుగా ఆయన పరిపాలన క్రింద సుభిక్షంగా. ఆ రాజ్య విలువలతో బ్రతకాల్సిన మనుష్యులు ఆయనకు విశ్వాస్యత చూపక తమ మానవ కల్పిత నిమ్న జీవన శైలిని నిజ మూల్యముగా ఊహించుకుని దానికి సాంస్కృతిక నేపథ్యాన్ని జోడించి అదే నిత్యమైన సత్యమన్న భ్రాంతికి లోనై వారి వారి స్వరాజ్యాలను నిర్మించుకున్నారు. భారత దేశంలో మనువాదం పేరట మారణహెూమం, అరాచకం, కొందరికే సామాజిక మరియు అన్ని రంగాల అర్హతలు కేటాయించి, బహు జనులను అదిమి ఉంచే బానిసత్వం కంటే భయంకరమైన రాజ్యం నడుస్తూ ఉండేది.

మరో పక్క భారతీయుల వలె ప్రపంచంలోని ఆయా సొంత రాజ్యాల పైన విస్తారవాదం పేరిట ఆక్రమణ దారులుగా క్రయ విక్రయాల పేరిట రాజ్యాలను కొల్లగొట్టే ఇంకో భయంకరమైన శ్వేత సౌద సామ్రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో భారతీయులపై రాజ్యం చేసేది. రెండూ దేవుని రాజ్య విలువలకు దూరంగా సామాన్యులను అదిమి వేసి, న్యాయం జరగనివ్వకుండా, విద్య రానివ్వకుండా, గౌరవం కొందరికి మాత్రమే దక్కే సొత్తు లాగా విజృంభించే రోజులు అవి.

ఈస్ట్ ఇండియా రాజ్యం బ్రాహ్మణ రాజ్యానికి వత్తాసు పలుకుతూ భారత దేశంలో స్థిరపడి పోతూ ఉంటె, ఆ శ్వేత సౌద ఆక్రమకులకు తమ స్వార్థ స్వలాభాల కారణంగా లొంగిపోయి ఊడిగం చేసి మరీ దేశాన్ని దోచిపెట్టిన బ్రాహ్మణ వాదులు తమ పెత్తనం రోజు రోజుకూ తగ్గిపోతుందని తెలుసుకున్న వెంటనే కుల ప్రాతిపదికన నిర్మించబడిన చాతుర్వర్ణ వ్యవస్థను కాపాడుకునే దిశగా పోరాటం మొదలు పెట్టారు. దానికి స్వరాజ్య పోరాటం అని పేరు పెట్టారు. స్వరాజ్య పోరాటం జరిగే రోజుల్లో అసలు స్వరాజ్యం అంటే కేవలం అగ్ర కులస్థులకు కావలసిన అధికార రాజ్యం మాత్రమే అన్న ఆలోచనను అంబెడ్కర్ గారి ఉపన్యాసంలో చెప్పారు: 'స్వరాజ్యమే గనక వస్తున్నట్టయితే అందులో మనం సమానమైన రాజకీయ హక్కులు పొందాలి మహాశయులారా! మనం అస్పృశ్యులం, ఇంకా బానిసలం కానందుకు అదృష్టంగా భావించాలి. అలా అయివుంటే వినిమయ వస్తువుల్లాగా, సంతలో సరుకుల్లాగా, పశువుల్లాగా అమ్ముడుపోయేవాళ్ళం. అయినప్పటికీ, ఈ రకమైన బానిసత్వంలో లేనందుకు మనం సంతుష్టులవ్వాల్సిన పని కూడా లేదు." (మరాఠి ప్రసంగం, కాస్ఫరెన్స్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్ ఫ్రం బొంబాయి ప్రొవిన్స్, బార్చి, షోలాపూర్ జిల్లా, వివరాలు: ఎస్. వాల్యూం -18(1) పేజీలు 13-24.2) అంటూ అంబేడ్కర్ గారు తన మనసులోని మాటలను వ్యక్త పరిచారు. 

ఈ దేశంలో పశువుల్లాగా వస్తువుల్లాగా తిరిగిన జాతులకు ఎప్పుడో రావాల్సిన సమానత్వం మెల్లిగా అంబేడ్కర్ గారి సమయానికి ప్రారంభం అయ్యింది. అది కూడా దేవుని రాజ్య విలువలను ఎరిగిన మిషనరీ వ్యవస్థ తెచ్చిన సామాజిక మరియు సాంస్కృతిక మార్పులే కారణం అని చెప్పక తప్పదు. “గ్రీసు, రోమాలలో అమలులో ఉండిన బానిసత్వంతో పోలిస్తే మన స్థితి ఎంతో మెరుగైనది. కాని మరో కోణంలోంచి చూస్తే, అస్పృశ్యత అనేది బానిసత్వం కన్నా దారుణమైనది. బానిసలు విముక్తులై రాజ్యంలోని స్వేచ్ఛాయుత పౌరులుగా మారిన దృష్టాంతాలు - చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. కానీ భారతదేశంలో అస్పృశ్యులు స్పృశ్యులయిన ఉదాహరణ ఒక్కటి కూడా లేదు." అంటూ ఈ దేశంలో ఉన్న అసమాజిక స్థితి గతులకు అద్దం పట్టే విధంగా మాట్లాడుతున్నారు అంబేడ్కర్ గారు. 

poona agreement


స్వరాజ్యం కోసం పోరాడేవారు ముందు సమాజంలో సామ్యవాద నిర్మాణం చేయాలంటూ అంబేడ్కర్ గారు ఇలా అన్నారు; "నేటి హిందూ సమాజంలో ఏకరూప వ్యవస్థలేదు. వీరు (బ్రాహ్మణులు) భూసురులు, వాళ్ళూ, మేమూ ఎన్నడూ కలవం. మరి వారి ఆచారాలు మేమెందుకు పాటించాలి? వాళ్ళు మమ్మల్ని ఉపనిషత్తులు విననీయనప్పుడు మా సొంత దేవత 'మారియారి' ని పూజించడం మేం ఎందుకు మానుకోవాలి? వాళ్ళు మమ్మల్ని వేదాలు వినవద్దని శాసిస్తే మేమెందుకు మా జాతి సంగీతాన్ని వదులుకోవాలి? ఒకవేళ మేము అన్నీ చెడు అలవాట్లే అలవర్చుకుని ఉంటే మరి మీరెందుకని మాకు మంచి గుణాలు నేర్పటానికి ప్రయత్నించలేదు? క్రిస్టియన్ల (విదేశీయుల), బ్రాహ్మణుల పిల్లలు ఒకరి నుంచి మరొకరు కొన్ని ప్రవర్తనా నియమాలు నేర్చుకుంటారు. కానీ బ్రాహ్మణులు, అప్పుృశ్యుల పిల్లల విషయంలో ఇలా జరగదు

"కులాల మధ్య ఈ గుణాత్మక భేదం లేనట్టయితే వివక్షా పూరిత కులవ్యవస్థ ఎక్కువ కాలం మనగలిగేది కాదు అని నేను ఒక్కోసారి అనుకుంటాను. అన్ని కులాల ప్రజలు సమానంగా సమర్థులయితే, వారు ఏ ఒక్క కులం ఆధిపత్యాన్నో అంగీకరించేవారు కారు. అందుకని మన ప్రజల్లో పని నైపుణ్యాలు పెంపొందించడానికి మనం తీవ్రంగా కృషిచేయాలి. అలా మనవాళ్ళ పని సామర్థ్యం పెంచే దిశగా లక్ష్యం పెట్టి గట్టి ప్రయత్నాలు సాగాలి. గుణాల్లో, సామర్థ్యాల్లో సమానత్వం వస్తే కుల ఆధారిత వివక్ష. అస్పృశ్యత కాలక్రమేణా అదృశ్యమౌతాయి"

ఆయనను స్వరాజ్య వ్యతిరేకిగా చిత్రిస్తున్న అగ్రకుల అధములకు ఈ విధంగా సమాదానం చెప్పారు, "నేను స్వరాజ్యానికి వ్యతిరేకం కాదు, కానీ మాకు న్యాయమైన వాటా ఇవ్వండి" గౌరవనీయులైన అధ్యక్షా, సోదర సోదరీమణులారా! ఇక్కడికి చేరుకోవడానికి నేను ఢిల్లీ నుంచి వెయ్యి మైళ్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాని పత్రికలు నిండా ఒకే అంశం కనిపిస్తోంది. అది గాంధీకి, నాకు మధ్య ఉన్న వైరుధ్యం. 1920 ప సంవత్సరం మొదలుకొని పాతికేళ్లుగా ఈ ఘర్షణ ఎందుకు కొనసాగుతోందో మీరు ఆలోచించాలి. గాంధీకి లోకమాన్య తిలక్తో విభేదాలు ఉండేవి. అతనికి గోపాలకృష్ణ గోఖలేతో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ఆ వివాదాలన్నీ సమసిపోయాయి.... ప్రస్తుతం అందరూ స్వరాజ్యం కావాలనే అంటున్నారు.. 

కానీ అది ఎవరికి స్వరాజ్యమో ఆలోచించండి. మనం సవర్ణులను అడిగేదల్లా ఒకటే మీరు మమ్మల్ని ఎందుకు పరిపాలించాలి? మాకు మా స్వరాజ్యం, న్యాయమైన హక్కులు అవసరం లేదా? "హిందువుల స్వరాజ్యం" అంటే నికార్సయిన పేష్వాల పాలనే. పేష్వాల పాలన కూడా స్వరాజ్యమే. కానీ అది. ఎంత దోపిడీతో కూడిందో, ఎంత కిరాతకమైందో మీకు తెలుసు. మనల్ని జంతువుల కన్నా హీనంగా చూశారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ తలెత్తకూడదు. గాంధీతో నా గొడవంతా ఇదే. నేను స్వరాజ్యానికి వ్యతిరేకిని కాను. అందులో మనకు సముచిత వాటా దక్కాలి. మనవాళ్లు అధికార స్థానాల్లో, న్యాయ వ్యవస్థలో ఉండాలి. 

రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు మీకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని గట్టిగా పోరాడాను. మన ప్రతినిధులుగా సవర్ణ హిందువులు ఎన్నుకున్న వ్యక్తులు ఉండకూడదని పట్టుబట్టారు. చివరికి విజయం సాధించి మన వారి కోసం ప్రత్యేక నియోజకవర్గాలు సాధించాను. కానీ ఇది గాంధీకి ఆమోదయోగ్యం కాలేదు. అంటరాని వారికి దక్కిన న్యాయమైన హక్కులను మోసపూరితంగా లాగేయడానికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీని ఫలితంగా గాంధీ ప్రాణాలు కాపాడటానికి నేను పూణా ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. దానివల్ల మన హక్కులు బాగా కుంచించు కొనిపోయాయి. మనందరం ఐక్యంగా కృషి చేసి ఈ నష్టాన్ని పూరించాలి.

మోసపూరిత రాజకీయ కుట్రను ప్రయోగాత్మకంగా ఎలా ఎదుర్కొని అసలైన స్వరాజ్యాన్ని సాధించాలని ఆయన ఆశ: "మనవాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులుగా, ప్రావిన్సుల్లో, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగానూ ఉండాలి. ఏడు ప్రావిన్సులలో కాంగ్రెస్ మంత్రివర్గాలు ఉన్నాయి. కానీ గాంధీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ఆ మధ్య గాంధీ మద్రాసులో పర్యటిస్తున్నప్పుడు 'అంటరాని వారితో మీకు అంత ఘర్షణ 'ఎందుకు ఉంది' అని ఓ వ్యక్తి ప్రశ్నించారు. దీనికి సూటిగా సమాధానం చెప్పకుండా 'బ్రిటిష్ వారు అంటరాని వారిని అధికారానికి అలవాటు చేశారు! అని వ్యాఖ్యానించారు, మరాఠాలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు కూడా రిజర్వేషన్లు ఉంటే గాంధీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కాని ఈ సదుపాయాలు అసుశ్యులకు వర్తింపజేయడాన్ని ఆయన సహించ లేకపోతున్నారు. ఉద్యోగాల్లోనూ, విద్యలోనూ, రాజకీయ ప్రాతినిధ్యంలోనూ, పరిపాలనాధికారాల్లోనూ, జీవనంలో స్వతంత్రత మొదలైన వాటి కోసం నిర్భయంగా దృఢంగా పోరాడగలిగిన ప్రతినిధులు మనకు అవసరం."

"అనేక సంవత్సరాల కిందట మీకు జ్ఞానం లేకపోవడం వల్ల వ్యవసాయ భూములు కోల్పోయారన్న విషయం గుర్తుంచుకోండి. ఈ భూములు 1874లో భూసేకరణ చట్టం రావడానికి ముందే బదిలీ అయిపోయాయి కాబట్టి నేను వాటిని మీకు వెనక్కి ఇప్పించలేక పోయాను. అందుకని మీ హక్కులను కాజేయకుండా. జాగరూకంగా ఉండాలి." "మన ప్రాణాలకైనా తెగించి మన గౌరవం కోసం, మన ఆత్మగౌరవం కోసం ఉమ్మడిగా, నిరంతరంగా పోరాడితే తప్ప మార్పు తీసుకురాలేం. ఇరవై ఏళ్ల కింద పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. ఆ రోజుల్లో మన రోజువారీ మనుగడ కోసం సవర్ణ హిందువుల మీద ఆధారపడే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది నాకు సంతోషదాయకమైంది. ఇంతకుముందు మహార్లకు కసవు ఊడ్చే ఉద్యోగాలు మాత్రమే దక్కేవి. ఇప్పుడు శాసనసభలో మన వాళ్లు 15 మంది ఉన్నారు. ఇతరులతో సమానంగా వారు ప్రత్యేక సదుపాయాలను అనుభవిస్తున్నారు. సమాజంలో సకలవిధ అఘాయిత్యాలను, దోపిడీని తొలగించడం మన కర్తవ్యం"

స్వరాజ్యం అన్నది కేవలం సవర్ణ జాతుల దురహంకారం కోసం మాత్రమే కానీ అందరి స్వాతంత్ర్యం కాదు అన్నట్టుగా ఆనాటి జాతీయ నాయకులు వ్యవహరించడం అలా వ్యవహరించడానికి ప్రజల మద్దతు లభించడం. దాన్ని స్పురించుకోవడం చూస్తే కొన్ని వందల సంవత్సరాల సాంస్కృతిక నేపద్యం ఇందులో కనిపిస్తుంది.

రామ రాజ్యం కోసం పోరాడిన గాంధీ, గోఖలే, తిలక్ దురహంకారుల అజెండా ఎక్కడ నుండి వచ్చింది అని ఆలోచిస్తే దాని నేపద్యం వారి పౌరాణిక, ఇతిహాసాలలో తప్పక దొరికి తీరుతుంది. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. ముందు మర్యాదా పురుషోత్తముడైన రాముని గురించి చదువుతాం.

అసలు ఈ దురహంకార ధోరణికి వారాశించే రామరాజ్యానికి లింకు ఏంటి అన్నది చూస్తే, అసలు స్వరాజ్యం అంటేనే కేవలం సవర్ణ జాతులకు అనగా బ్రాహ్మణ, వైశ్య జాతులకు, వారి పురాతన లేక పౌరాణిక సామాజిక జీవన విధానాన్ని తిరిగి వారికి ఇచ్చేయడం, అంటే బ్రాహ్మణుడికి మిగిలిన మూడు వర్ణాలు ఊడిగం చేయాలి, క్షత్రియునికి మిగిలిన రెండు వర్గాలు ఊడిగం చేయాలి, వైశ్యునికి శూద్రులు ఊడిగం చేయాలి, శూద్రునికి అంటే ఈ నాటి రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, దాసరి, మంగలి, గొల్ల కురుమ, గౌడ వంటి జాతులు అన్నీ - ఏ హక్కు లేకుండా కేవలం ఊడిగం చేసేందుకే బ్రతకాలి. ఇది వారు కోరుకున్న రామరాజ్యం, స్వరాజ్యం. 

ఇటువంటి భారత దేశ దర్శనానికి ఆ నాటి అగ్ర వర్ణ రాజకీయ నాయకులు ప్రతినిధులుగా వ్యవహరించారు. అలా.. వ్యవహరించడానికి ప్రజల మద్దతును కూడా కూడగట్టారు. అలా కూడగట్టడానికి ఎలా సాధ్య పడింది. అని ఆలోచిస్తే కొన్ని వందల సంవత్సరాల సాంస్కృతిక నేపద్యమైన చాతుర్వర్ణ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి రామ రాజ్యాన్ని, స్వరాజ్యంగా చిత్రీకరించి వారి సొంత లాభాల కోసం పోరాడిన గాంధీ, గోఖలే, గంగాధర్ తిలక్ వంటి జాతీయ స్థాయి నాయకులకు ఆ అగ్ర వర్ణ కుల అజెండా ఎక్కడ నుండి వచ్చింది? అని ఆలోచిస్తే దాని కుల అహంకార మూలాలు వారి సంస్కృతి పేరిట మసి పూసి ప్రజల పై రుద్దే పౌరాణికాలలో, రామాయణం వంటి ఇతిహాసాలలో మాత్రమే దొరుకుతాయి. ఈ ఇతిహాస మహా పురుషుడు చాతుర్వర్ణ సమాజానికి అధినాయకుడు, బ్రాహ్మణ కుల అహంకారవాదుల చేతులలో ఇరుక్కుని పరిపాలించిన రాముడి రాజ్యం, ఆ రాజ్యంలో రాముని జీవన విధానం గురించి కొంచెం చూద్దాం.   

కులమన్నది విషవృక్షమే; పెకిలించుట

ఎలా మతమన్నది అడ్డుగోడే; 

పడగొట్టుట ఎలా

ఎన్ని తీర్ల నీకైన ఎడా ఎడా చెప్పొచ్చు.

ఆచరణే మహాకష్టం;

నిలదీయుట ఎలా


-ఏనుగు నరసింహారెడ్డి పద్యం 497

 

స్వరాజ్యం - దేవుని రాజ్యం

 


కామెంట్‌లు