దేవుని రాజ్యం పట్ల అవగాహన ! | Understanding the Kingdom of God!

 దేవుని రాజ్యం పట్ల అవగాహన | Understanding the Kingdom of God!


దేవుడు తన ప్రణాళికలో అంతర్భాగంగాను మరియు తన ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యంగాను కలిగియున్న అతి ప్రాముఖ్యమైన అంశం ఆయన రాజ్యం, లేక కుటుంబం. తనను తాను కుటుంబంగా పరిచయం చేసుకున్న త్రియేక దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకున్న మానవాళి కూడా తన కుటుంబంలో భాగం అవ్వాలని, దేవుని రాజ్యమన్న పేరుతో నిత్యం విలసిల్లాలని, అయితే తన ప్రణాళికలో భాగంగా, పతనావస్థకు చేరుతాడన్న మానవుని విమోచన కొరకు తన స్వంత కుమారున్ని వారి పాపస్థితి నుండి విడిపించటానికి లోకానికి అనగా ప్రజల కొరకు పంపాడు తండ్రి. తండ్రి అభీష్టం నెరవేర్చే కుమారుడు, కుమారుని మహిమపరచే పరిశుద్ధాత్మ, కుమారున్ని దేవా అని పిలిచే తండ్రి, ఆత్మ వాక్యమే దేవుని వాక్యం అని చెప్పే కుమారుడు ఒక కుటుంబంలో భాగంగా ముగ్గురు వ్యక్తులు ఒకరిని ఒకరు మహిమపరచే అనూహ్యమైన నిత్య సంబంధాన్ని మానవాళికి చూపించి, అదే స్థితిలోనికి తమ పిల్లలను అనగా యేసు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన పిల్లలను కూడా సమకూర్చాలన్న యోచన బైబిల్ సమగ్ర పరిశీలనకు సారాంశం అని చెప్పాలి..

మార్కు 1:15 - కాలము సంపూర్ణమైయున్నది. దేవుని రాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మత్తయి 4:17 అప్పటినుండి యేసు పరలోక రాజ్యము - సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.

యెహెూవా రాజ్యం చేస్తున్నాడు | YHWH is ruling



ఆ రాజ్యం గురించి అనగా ఆ తండ్రి కుటుంబం గురించి యేసు చేసిన బోధలు బైబిల్ యావత్తులోను కనిపిస్తుంటాయి. మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. యేసు తన జీవన కాల వ్యవధిలో తన తండ్రి రాజ్యం, తన రాజ్యం, పరిశుద్ధ రాజ్యం, నిత్య రాజ్యం గురించే ప్రకటించాడు కానీ ఎదో కేవలం పరలోక ప్రాప్తిని గురించి మాత్రమే ప్రకటించి వెళ్లిపోయాడు అనేంత సంకుచిత సువార్త బైబిల్లో కనబడదు. అయితే ఆ రాజ్యము ఒక రాజకీయ నాయకుడు కట్టే రాజ్యమును పోలి ఉండదు.

యేసు - నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. (యోహాను 18:36)

రాజ్యం అనగానే అధికార దాహం, పొరుగు వారిపై పెత్తందారి తనం, కొల్లగొట్టే విధానం, దోపిడీ, కుళ్ళు, కుతంత్రాలు, వెన్నుపోటు, ఈర్ష్య మొదలయిన అనేక సామాజిక, వ్యక్తిగత మరియు కుటుంబపరమైన హక్కులు, బాధ్యతలు, స్థితి, స్థాయి మొదలయిన గౌరవ ప్రదమైన అంశాలను మట్టిలో కలిపే వ్యవస్థ మనకు కళ్ళముందు మెదలాడుతుంది. ఇది మన పాప పతన స్థాయికి సంబంధించిన అంశం. ఇలా ఆర్థిక రంగం ఉపయోగించి పొరుగు వానిపై పెత్తనం చేయడం, సామాజిక స్థితి గతులలో ఒకరికున్న ఆధిక్యత ఇంకొకరికి శాపంగా మారే విధంగా అధికారాన్ని పెత్తనంగా మార్చే దుర్వినియోగ పద్ధతులు, ప్రభుత్వరంగంలో అధికార దుర్వినియోగం, వ్యాపార రంగంలో అధికార దుర్వినియోగం ఇలా సమాజంలోని ప్రతి రంగంలోను ఒకరిని ఒకరు విభజించుకొంటూ, ఒకరిపై ఒకరి పెత్తనాన్నే అధికారం అనుకుంటూ దేవుని ప్రణాళికకు విరుద్ధంగా జీవించే జీవన విధానం ఈరోజు కనిపించే రాజ్యాలలో చూస్తాం. కానీ యేసు తన రాజాన్ని ఈ లోక సంబంధమైనది కాదని, అది ఆత్మీయమైన విలువలతో కూడినదని తన జీవన విధానంలో చెప్పాడు, చేసాడు అలాగే జీవించాడు.

లూకా 17:20-21లో దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు. ఆయన నడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనేయున్నది గనుక, ఇదిగో యిక్కడనని, అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. ఈ వాక్యాధారంగా దేవుని రాజ్యం మన మధ్య ఉండేదే అయినా మనకు కనిపించేది కాదు. కనిపించని వ్యవస్థగా అది మనలను ఆ రాజ్య విలువలతో నడిపించేదిగా ఉంటుంది.

రోమా 14:17 - దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. ఈ మాటకు సందర్భానుసారమైన అర్ధం గమనిస్తే భోజనాన్ని, పానీయాన్ని అడ్డం పెట్టుకుని ఒకరికి తీర్పు తీర్చటం క్రైస్తవ దృక్పథంలో చోటులేని పని అని నిజానికి దేవుని రాజ్యం అనేది భౌతికపరమైనది మాత్రమే కాదు కానీ నీతి, సమాధానం మరియు పరిశుద్ధాత్మయందలి ఆనందం అన్న అభౌతిక ఆత్మీయ ఆధ్యాత్మిక స్థితి మరియు పునరుత్థాన జీవితము దేవుని రాజ్యమును సూచిస్తుంది. ఇలాంటి రాజ్యమును గురించి దానియేలు ముందే చూసి ప్రవచించిన దాఖలాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. రాజైన నెబుకద్నెజరుకు  కలిగిన స్వప్నం, దాని వివరణ దానియేలు వివరించిన విధానం చూద్దాం.

దానియేలు 2:31-45 వరకు గల వాక్య భాగంలో పాదములు,  వ్రేళ్ళు కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అని చూస్తాం. ఈ భేదములు ఈ లోక రాజ్యాలు తీసుకు వచ్చే సామాజిక వ్యవస్థను సూచిస్తున్నాయి. అవే మన దేశంలోను, మిగిలిన దేశాలలోను ప్రజల పట్ల ఉండే భేదములుగా చూస్తాం. వివక్షతో కూడిన సామాజిక వ్యవస్థ. "చాతుర్వర్ణ్యం మయా సృష్ణా" అని స్వయంగా శ్రీకృష్ణుడే తన సృష్టికార్యంలో వివక్షతో కూడిన చతుర్వర్ణాలను కలుగజేసినట్టు చెప్పుకునే భావ జాలాలు, స్త్రీపురుషుల మధ్య, భిన్న జాతుల మధ్య, రంగు బేధం, ప్రాంత భేదం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో భేదాన్ని తీసుకువచ్చే భావజాలాలు, సామాజిక వ్యవస్థలు మన చుట్టు కనిపిస్తున్నాపుడు ఇలాంటి బేధములు లేకుండా సమసమాజముగా ఉండటము దేవుని రాజ్యపునాది. అది ఇక్కడే ఈ భూమిపైనే యేసు స్థాపించడానికి తన తండ్రి అభిష్టాన్ని నెరవేర్చే పనిలో ఆయన ఈ లోకానికి వచ్చి, దానియేలు ప్రవచించిన రాజ్యమును స్థాపించాడు.

"మరియు చేతిసహాయము లేక తీయబడిన ఒక రాయి, యినుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమయొక్క పాదముల మీదపడి దాని పాదములను తుత్తునియలుగా విరుగగొట్టినట్టు తమకు కనబడెను. అంతట ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండ గాలి వాటిని కొట్టుకొనిపోయెను; ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహా పర్వతమాయెను.”

"ఈ రాయి ఎవరు? ఏమిటి?" అని అంటే ఒక విప్లవ రూపంలో యేసు స్థాపించిన దేవుని రాజ్యమే. ఆరాజ్యపు అడుగులు ముందు పాతాళలోకపు ద్వారములు నిలువజాలవని యేసు ముందే చెప్పాడు. ఈ రాజ్య విలువలు లోకమందున్న మరే ఇతర రాజ్యమునైనను దంచి కొడతాయి. మరే యితర రాజ్యాల విలువలు కూడా ఈ రాజ్య విలువల ముందు నిలువలేవు. నిలువ నీడ లేకుండా గాలికి కొట్టుకు పోతాయి. ఈ రాజ్యానికి రాజు భౌతికంగా కనిపిస్తూ ఒక రాజకీయ శాసన మండలిని ఏర్పాటు చేస్తాడు అనుకుంటే పొరబాటే. సర్వసృష్టిని పాలించు రాజు తనను స్వచ్చందంగా నమ్మి అనుసరించే వారి ద్వారా తన విలువలను ఆత్మీయ ఆధ్యాత్మిక అభౌతిక సత్యాలుగా స్థాపించి ప్రజల హృదయాలను ఏలుతాడు.

దానియేలు 7:27 - ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. ఆ రాజ్య అధికారము ఈలోక అధికారమును విధేయులుగా చేస్తుంది. ఆ అధికారము పెత్తనముతో కూడినదిగా కాకుండా పరిశుద్ధులకు చెందినదిగా ఉంటుంది. ఆ రాజ్యము నిత్యమూ నిలిచేదిగా ఉంటుంది. ఈ రాజ్యము సంఘముగా దేవుని పిల్లల సమూహముగా ఈ లోకమును శిష్యత్వములోనికి నడిపేదిగా ఉండి క్రీస్తు రాకడ సమయాన క్రీస్తుతో కలిసి రాజ్య భారమును కలిగి ఉండేదిగా ఉంటుంది. ప్రకటన 11:15 - ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయెను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.

అనగా క్రీస్తు రాజ్యములో ఈలోక రాజ్యములన్ని ఉంటాయి. వాటి వాటి విలువలను మార్చుకుని పరలోక రాజ్య విలువల వైపుకు సంపూర్ణ విధేయత వైపుకు నడుస్తాయి.

దేవుని రాజ్యం అంటే చచ్చి పోయిన తరువాత అనుభవించేది అని అనుకోవడం పొరబాటే. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే అన్న విషయం కూడా చాలా మందికి అవగాహన కొరవడింది. నిజానికి వాక్యానుసారంగా ఆ రెండూ ఒకటే. పాత నిబంధనలో కూడా చాలా సార్లు దేవుని రాజ్యం యొక్క వివరణ కనబడుతుంది. సైన్యములకు అధిపతి అయిన యెహెూవా భూమిపై తన రాజ్యాన్ని స్థాపించి ఆ క్రమంలో తన రాజును నిలబెట్టే సమయాన్ని గురించి చాలా సార్లు పాత నిబంధన గ్రంధం వివరిస్తుంది. యేసు కూడా తన పరిచర్య మొదటి రోజుల్లో దేవుని రాజ్యం వచ్చింది అని ప్రకటించాడే కానీ దానికి వివరణ ఇవ్వలేదు. ప్రజలు కూడా అదేదో ఏళ్ళ తరబడి బాగా తెలిసిన విషయమే అన్నట్టు విన్నారు. ప్రవక్తల నోట మరియు వారి ప్రవచనాలలో దేవుడైన యెహెూవా వచ్చి ఇశ్రాయేలు పై రాజ్యం చేస్తాడు అన్న మాటను వారు చాలా తరాలుగా వింటూనే ఉన్నారు. కాబట్టి పాత నిబంధన ప్రకటించిన దేవుని రాజ్యం ఏమిటి దాన్ని యేసు ఏ విధంగా తన జీవిత సమయంలో నిజం చేసి చూపించాడు అన్నది అధ్యయన చేయాల్సిన విషయమే!


కామెంట్‌లు

  1. యేసు క్రీస్తు ప్రభువు నామమున మీకు వందనములు.
    దేవుని రాజ్య స్థాపన కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు నిరంతరం శ్రమిస్తున్న సహోదరులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి