ఏది ప్రధానం? సంఘమా లేక రాజ్యమా? The Church or The Kingdom of God - Which is the Priority?

ఏది ప్రధానం? సంఘమా లేక రాజ్యమా?

క్రీస్తు సంఘానికి మరియు ఆయన రాజ్యానికి అవిభాజ్య సంబంధం ఉంది. క్రీస్తు సంఘము ఆయనను రాజుగా హృదయములయందు ప్రతిష్టించుకున్న వారి సముదాయమైతే ఆయన రాజ్యం మరింత సార్వత్రికంగాను మరియు మరిన్ని క్షేత్రాలలో విస్తరించి ఉంటుంది. క్రీస్తు సంఘము ఆయన శరీరము కనుక ఆ సంఘస్తులకు క్రీస్తు భుజములపై ఉన్న రాజ్య భారం ఉంటుంది. క్రీస్తు శరీరానికి లేక సంఘానికి ఉన్న ప్రధాన బాధ్యత దేవుని రాజ్యాన్ని సృష్టిలో తిరిగి తీసుకు రావడమే. ప్రతి క్షేత్రాన్ని ప్రతి రంగాన్ని తిరిగి క్రీస్తు కొరకు విడిపించడమే సంఘమునకున్న ప్రధాన బాధ్యత, పరిశుద్ధాత్ముని వరములు కలిగి ఆయన ఫలమును సమాజములో అనగా సృష్టి యావత్తులో విస్తరింపజేయడమే సంఘమునకు ఉన్న ప్రధాన లక్ష్యం.

Which is priority? Church or Kingdom?

 తెలుగు బైబిల్ అనువాదకులు 'ఎక్లీసియా' అన్న గ్రీకు పదము నుండి సంఘము అనే పదాన్ని తర్జుమాలో వాడారు. 'ఎక్లీసియా' అన్న పదం చరిత్రలో కేవలం యేసు మాత్రమే వాడలేదు సుమా ఆయన కంటే ముందు గ్రీకులు తమ జ్ఞానమును తత్వ శాస్త్రాన్ని పలు దేశాలకు చేరవేయడానికి ప్రభావమును ఇతర దేశాలపై చూపడానికి వారు చెరపట్టిన రాజ్యాలలోనికి "ఎక్లీసియా" అనే ఒక స్వతంత్ర లేక స్వచ్చంద మానవ గుంపును పంపే వారు. వారు జీత భత్యాలకు కాక గ్రీకు తత్వానికి వారి సాంస్కృతిక మరియు సామాజిక జీవన విధానాలకు కట్టుబడిన అంకిత భావం కలవారై వెళ్ళిన ప్రతి చోటా గ్రీకు సంస్కృతి మరియు తత్వాన్ని నూరి పోసేవారు. 

అటు తరువాత రోమీయులు గ్రీకులను ఓడించి రాజ్యం పొంది వారు కూడా  "ఎక్లీసియా" అనే సమాజాన్ని వారి కైసరు, మహిమ, యుద్ధ పటిమ, భవన నిర్మాణ సాంకేతికత, బట్టలు ధరించే వగైరాలను చెరపట్టిన రాజ్యాలలో విస్తృతం చేయడానికి ఉపయోగించారు. ఆ నేపథ్యంలో యేసు తన శిష్యులను 'ఎక్లీసియా' అని పిలిచాడు. అప్పటి ఆయన పుట్టి పెరిగిన సంస్కృతిలో 'సినగోగు' లేక 'సమాజ మందిరం' అనే సంస్కృతి ఉంది. 

    మతమే గనక ఆయనకు ప్రధానమైతే ఆయన ఇంకో సినగోగు స్థాపించేవాడు కానీ యేసుకున్న ప్రధాన లక్ష్యం ఆయన రాజ్యం కనుక ఆ రాజ్య స్థాపనకు అనువైన పద్ధతి అయిన 'ఏక్లీసియా' అనే సమాజాన్ని యెన్నుకున్నాడు. "ఎక్లీసియాగా" పిలిచిన తన శిష్యగణం ప్రపంచాన్ని 'యేసే' క్రీస్తు లేక 'రాజు/ప్రభువు' అనే భావజాలంతో లేక సువార్తతో తలక్రిందులు చేయసాగారు. అపొస్తలుల కార్యములు 17:1-9 వరకు పౌలు చేసిన ప్రకటన యేసే క్రీస్తు అని కదా? ఆయన క్రీస్తు అనగా దానియేలుకు కనిపించిన నిత్యం రాజ్యమును స్థాపించు క్రీస్తు గురించే ప్రకటిస్తూ తిరిగాడు. ఆ రాజ్యం గురించి పేజి. నెం. 9లో చూశాము కదా. అదే అక్కడి యూదులకు అర్థం అయ్యింది. కనుకనే కైసరు కాకుండా వేరొక రాజున్నాడని వీరు బోధిస్తున్నారని ఫిర్యాదు. చేశారు. కనుక క్రైస్తవ సంఘము దేవుని రాజ్య స్థాపనకు ప్రభువు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించే సమాజమే కానీ మత ప్రాతిపదికన యేదో కొన్ని కార్య కలాపాలు చేసే సంఘం కానే కాదు. క్రైస్తవ సంఘ ప్రధాన లక్ష్యం చచ్చిపోయి పరలోకం పోవడం కాదు కానీ బ్రతికి ఉండగానే దేవుని రాజ్యం నిర్మించడం. మానవ జీవన రంగాలలో యేసు క్రీస్తు ప్రభుత్వాన్ని ఆయన వాక్య విలువల ద్వారా నిర్మించడం.

మతం మానవ గుణమైన దేవుని సంతోష పరచాలన్న కోరికను కుంటుపరచి లేక వాడుకుని కేవలం కొన్ని కర్మ కాండలకు పరిమితం. చేస్తుంది. మతం మనిషిని మరణానంతర జీవితం వైపు దృష్టి ఉంచే విధంగా ప్రోత్సహిస్తుంది కానీ రాజ్య దృక్పథం మనిషికి ఈలోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించాలన్న కసిని ఇస్తుంది. మతం మనిషిని దేవుని చేరే ప్రయత్నం చేయమని నేర్పితే రాజ్య విలువలు దేవుడే మనిషిని చేరడం కారణంగా ప్రాతినిధ్యం సంపాదించడం అవుతుంది. మతం సృష్టి నుండి మనం విడిపింపబడటం కోరుకుంటే రాజ్యం సృష్టిని విమోచించేందుకు ప్రయత్నించమంటుంది, అందుకు మార్పు కోసం శ్రమించమంటుంది. మతం స్వర్గం చేరేందుకు అయితే రాజ్యం స్వర్గాన్ని తెచ్చేందుకు పాటు పడుతుంది. మొత్తానికి దేవుని రాజ్యం రాజుకున్న ప్రాధాన్యతలు, విలువలు, నైతికత, సంస్కృతి, రాజు స్వచిత్తం, ఆయన న్యాయం, నీతి మొదలైన విలువలను తన రాజ్యం పై అమలుపరచే విధంగా తన వైభవాన్ని ప్రభావాన్ని చూపించే దిశగా ఉంటుంది. సంఘము ఆ రాజ్యమును స్థాపించటానికి రాజు చేతిలో ఉపకరణంగా పనిచేస్తుంది. ఈ నిర్వచనంలో మనం యే కోవకు చెందిన క్రైస్తవులమో ఆలోచించుకోవాలి. కేవలం మత ప్రాతిపదికన ఉండే సమూహమా దేవుని రాజ్యమును స్థాపించాలన్న కసి, కాంక్ష కలిగిన క్రీస్తు సైనికులమా అని ఆలోచించుకోవాలి. మన ముందు నడిచిన విశ్వాస యోధులందరూ సైనికులై, కర్షకులు, దూతలు, అధికారులై పనిచేశారు. మన పాత్ర యేమంటారు?

కామెంట్‌లు